తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. పాల్గొన్న మంత్రులు

Telangana Formation Day: రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంతా కలిసి రావాలని సూచించారు.

telangana formation day celebrations
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

By

Published : Jun 2, 2022, 3:49 PM IST

Telangana Formation Day: తెలంగాణ పథకాలు దేశానికే సరికొత్త పంథాను నిర్దేశిస్తున్నాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. గూడులేని పేదవారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల మహిళల కోసం అపారెల్ పార్కు ప్రారంభించామన్న కేటీఆర్.. మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు అందించామని చెప్పారు. స్థానిక యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని వెల్లడించారు.

సిరిసిల్లలో అమరవీరులకు మంత్రి కేటీఆర్ నివాళులు

ఉమ్మడి వరంగల్​లో:ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధిస్తున్న విజయాలు.. అనేక రంగల్లో వచ్చిన పురస్కారాలు రాష్ట్రంలో తెరాస పరిపాలనకు గీటురాళ్లని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని... వరంగల్ కోట అమరవీరుల స్ధూపం వద్ద స్ధానిక ప్రజాప్రతినిధులతో కలసి మంత్రి ఎర్రబెల్లి నివాళులర్పించారు. అనంతరం కుష్ మహల్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఉద్యమంలో పాల్గొన్నవారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అమర వీరుల స్తూపం వద్ద గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.

అమరవీరుల కుటుంబాలను సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి
అమరవీరుల స్తూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్

అగ్రగామిగా తెలంగాణ:ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం సుస్థిరమైన ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా నిలిచిందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అగ్రగామిగా పురోగమిస్తోందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు.

అమరవీరుల స్తూపానికి మోకరిల్లుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తూ ప్రగతిపథంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని నూతన ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి జాతీయ పతాకాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లా ప్రజల చిరకాలవాంఛ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అనంతరం వనపర్తి జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆవిర్భావ వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అమరవీరుల త్యాగం వెల కట్టలేనిదన్న మంత్రి జగదీశ్ రెడ్డి.. వారికి జోహార్లు తెలిపారు. అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.

అదే తెరాస ప్రభుత్వ లక్ష్యం: ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద రాష్ట్ర ఏర్పాటు జరిగిందని.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. నేడు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని.. రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. నిజామాబాద్​లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

ప్రజల ఆశయాలకు అనుగుణంగా:రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ పరేడ్ మైదానంలో ఉత్సవాలకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా తెరాస పాలన సాగుతోందని తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్
అమరవీరులకు నివాళులర్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి

అహింసాయుత పోరాటం ద్వారా సీఎం కేసీఆర్‌ తెలంగాణను సాధించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం డిపో రోడ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో దూసుకెళుతోందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:CM KCR : 'తెలంగాణ సజల, సుజల, సస్యశ్యామలంగా మారింది'

ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై పెత్తనం: కేసీఆర్

Telangana Formation Day 2022: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. చిత్రమాలిక

ఉద్వేగంగా 'మేజర్​' జనగణమన పాట.. కిర్రాక్​ టైటిల్​తో షారుక్!

ABOUT THE AUTHOR

...view details