Teegala Krishnareddy will Joins in Congress : ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రేతో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలతో సమావేశమైన వీరు.. తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానమిలా..: తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గా పని చేశారు. హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన తీగల.. 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి...సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, బీఆర్ఎస్లో చేరిన తీగల.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయారు. అనంతరం సబితా హస్తం పార్టీని వీడి కారెక్కి మంత్రి అయ్యారు.
Rangreddy Zp Chairman Anitha will Joins in Congress : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి.. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అయ్యారు. మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని టీకేఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే బీఆర్‌ఎస్ టికెట్ వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడటంతో పార్టీ మారటమే మేలని తీగల భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత నెలాఖరున ఈటీవీ-ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇవ్వకుంటే కారు దిగటం ఖాయమని వ్యాఖ్యానించారు.