తెలంగాణ

telangana

ETV Bharat / state

అటు మునుగోడు, ఇటు రాహుల్‌ యాత్ర.. రెండింటి మధ్య టీకాంగ్​ తర్జన భర్జన

TCONG on Munugode bypoll and Rahul tour: ఓవైపు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర, మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలు రెండూ ఒకేసారి ఉండడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం తర్జనభర్జనలు పడుతోంది. రెండూ పార్టీకి ప్రతిష్ఠాత్మకం కావడంతో వాటిని ఏవిధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్న కోణంలో..  కసరత్తు చేస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో  చొరవ చూపని నాయకులను తొలగించి.. కొత్త వాళ్లకు అవకాశం కల్పించే కార్యక్రమాన్ని చేపట్టింది.

cong
cong

By

Published : Oct 6, 2022, 7:07 AM IST

Updated : Oct 6, 2022, 8:34 AM IST

అటు మునుగోడు, ఇటు రాహుల్‌ యాత్ర.. రెండింటి మధ్య టీకాంగ్​ తర్జన భర్జన

TCONG on Munugode bypoll and Rahul tour: మునుగోడు ఉప ఎన్నికలను అన్ని పార్టీలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో మూడు ప్రధాన పార్టీలు చావో రేవో తేల్చుకునేందుకు సిద్దపడుతున్నాయి. భాజపా, తెరాసలు ఇంఛార్జిలను నియమించి ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముందే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించి మండలాలకు, క్లస్టర్లకు, బూతుల వారీగా ఇంఛార్జిలను నియమించి ఇంటింటి ప్రచారం ఇప్పటికే చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

రెండు రోజుల కిందట మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అక్కడి ఇంఛార్జిలతో సమావేశమైన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలతో పాటు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పాల్గొని దిశానిర్దేశం చేశారు. దాదాపు 3 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో.. క్లస్టర్ల వారీగా, బూతుల వారీగా నియమించిన నాయకుల పని తీరుపై ఆరా తీశారు. ఎవరెవురు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు.. ఎవరెవరు తిరగలేదు తదితర వివరాలను దగ్గర పెట్టుకుని సమీక్ష నిర్వహించారు.

సమయం కేటాయించలేని నాయకుల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా అయిదారు నుంచి పది బూతులను ఒక క్లస్టర్‌గా చేసుకుని ఇంఛార్జిలను ఏర్పాటు చేశారు. వీరంతా క్షేత్రస్థాయిలో తిరిగి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి. ఈ నెల 9 నుంచి 14 వరకు నాయకులు అంతా క్షేత్రస్థాయిలో మకాం వేసి ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను అభ్యర్థి పాల్వాయి స్రవంతి వేయనుంది. ఆ తర్వాత 14న భారీ జనసమీకరణతో.. మరొకసారి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర ఈ నెల 24న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. మక్తల్‌ నియోజక వర్గంలో ప్రవేశించే ఈ యాత్ర... జుక్కల్‌ అసెంబ్లీ మద్నూర్‌ వద్ద మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. 13 రోజులపాటు 360 కిలోమీటర్లు కొనసాగే జోడోయాత్ర.. మునుగోడు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలోని కొనసాగనుంది.

ఈ సందర్భంగా రాహుల్​తో పాటు నడక కొనసాగేందుకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని.. వివిధ రంగాలకు, వర్గాలకు చెందిన నాయకులను కలిపించాలని, వివిధ సమస్యలను ఆయన ముందు ఉంచాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎవరెవరు మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతలు పూర్తి స్థాయిలో తీసుకోవాలి, ఎవరెవరు భారత్‌ జోడోయాత్రకు సంబంధించిన అన్ని అంశాలు చూసుకునేందుకు ముందుకొస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

దేనికదే ప్రాధాన్యతగా తీసుకుని పని చేస్తేకాని.. మునుగోడులో ఆశించిన ఫలితాలు రావని పార్ట్రీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పని విభజన చేసి సీనియర్లకు బాధ్యతలు అప్పగించే దిశలో పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details