'వరద ముంపుతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపాము. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంట్లో సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ప్రభుత్వం ప్రకటించిన తక్షణం సాయం రూ. పదివేలు కూడా అందలేదు. ఆ నగదు ఇచ్చినా జరిగిన నష్టానికి ఏ మత్రం సరిపోదు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించు కోలేదు'. ఇది భాగ్యనగరంలో వరదల ధాటికి ముంపునకు గురైన బాధితుల ఆవేదన. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో పలు పార్టీల నాయకులు.. తమను గెలిపిస్తే డివిజన్‌ని అభివృద్ధి చేస్తామని ఎన్నో రకాల హామీలిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రతిపాదనలు తాము పెట్టడం లేదని ముంపు సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ పరీవాహక ప్రాంతం సుభాష్‌నగర్ వాసులు.
'మా కాలనీల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తేనే ఓట్లు వేస్తాం' ఆక్రమణలు తొలిగించాలి
నాలాల ఆక్రమణలు తొలిగించి.. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తేనే ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని పాలకులకు వరద బాధితులు స్పష్టం చేస్తున్నారు. ఓటు వేసేందుకు డబ్బులు, ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదనలు పెట్టడం లేదని అన్నారు. నాలాల ఆక్రమణలు తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 30 ఫీట్ల వెడల్పున్న సుభాష్‌నగర్ కెమికల్ నాలా ఆక్రమణలతో 9 ఫీట్లకు చేరింది. కళ్లముందే నాలాలపై అక్రమ నిర్మాణాలు కన్పిస్తున్నా తొలగించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ధైర్యం చేయడం లేదని వాపోయారు. దీనిపై స్పష్టత ఇచ్చిన నేత గెలుపుకు కృషి చేస్తామని సుభాష్ నగర్, గంపల బస్తీల ప్రజలు బదులిచ్చారు.
ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కాంగ్రెస్