తెలంగాణ

telangana

ETV Bharat / state

Modi Visit Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం

Modi Visit Statue of Equality: జగద్గురు శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం జరగబోతుంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3 గంటలపాటు ముచ్చింతల్​లోనే మోదీ గడపనున్నారు. ప్రధాని రాక సందర్భంగా 8 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రేపే అత్యంత కీలక ఘట్టం
Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రేపే అత్యంత కీలక ఘట్టం

By

Published : Feb 4, 2022, 8:42 PM IST

Updated : Feb 5, 2022, 12:35 AM IST

Modi Visit Statue of Equality: మనిషికి కులం కంటే గుణం గొప్పదని చాటి సమతామూర్తిగా ఎదిగిన మహా మనిషి శ్రీరామానుజచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంతంతో పండితులను, పామరులను ఏకం చేసిన సామాజిక శాస్త్రవేత్త. అలాంటి మహనీయుడి వెయ్యేళ్ల వైభవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ విగ్రహ ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్​లో త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆరేళ్ల సంకల్ప సిద్ధికి ఆకారంగా తీర్చిదిద్దిన 216 అడుగుల రామానుజచార్యుల పంచలోహ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ లోకార్పణం చేయనున్నారు. వసంత పంచమి వేళ.. వేలాది భక్తులు, వేద పండితుల నమో నారాయణ మంత్రం మారుమోగుతుండగా.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కన్నుల పండువగా జరుగనుంది.

3గంటల పాటు ప్రధాని పర్యటన

PM Muchintal Tour: దిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పటాన్‌ చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొనున్న మోదీ... నాలుగున్నరకి తిరిగి శంషాబాద్‌ వస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్​లో ప్రధాని ముచ్చింతల్​కు చేరుకుంటారు. దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి కేంద్రంలోనే మోదీ పర్యటిస్తారు. మొదట యాగశాలకు చేరుకొని విశ్వక్ సేనుడిని ఆరాధిస్తారు. అక్కడి నుంచి సమతామూర్తి కేంద్రానికి వస్తారు. ఆ తర్వాత 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. భద్రవేది మొదటి అంతస్తులో ఉన్న రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని తిలకిస్తారు. అనంతరం భద్రవేదిపై బ్రహ్మాండ నాయకుడిగా కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి సమక్షంలో పూజలు నిర్వహించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత శ్రీరామానుజచార్యుల విశిష్టతపై అరగంట పాటు ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే సమతామూర్తిపై రూపొందించిన 3డీ మ్యాపింగ్​ను ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వీక్షిస్తారు. సుమారు 15 నిమిషాలపాటు ఆ ప్రదర్శన ఉంటుంది. అనంతరం మచ్చింతల్ నుంచి రహదారి మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని దిల్లీ వెళ్లనున్నారు.

ప్రధానితో మోదీతో పాటు వారికే..

సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో వేదికపై మోదీతోపాటు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావుకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు, నిర్వాహకులకెవరికీ అనుమతి లేదు. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా సమతామూర్తి కేంద్రం చుట్టూ భద్రతా బలగాలు ముందస్తుగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. విగ్రహ పరిసరాలకు వాలంటీర్లు, ఇతర భక్తులెవరిని అనుమతించలేదు. డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇక్రిశాట్, ముచ్చింతల్​లో 8 వేల మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

లక్ష్శీ నారాయణ మహాయాగం యథాతథం

ప్రధాని రాకకు ముందు సహస్రాబ్ది ఉత్సవాల్లో రోజు జరగాల్సిన లక్ష్మీనారాయణ మహాయాగం యథాతథంగా కొనసాగుతుంది. అలాగే నాలుగో రోజు వేడుకల్లో భాగంగా విజయప్రాప్తి కోసం విశ్వక్సేనేష్టి, విద్యాప్రాప్తి కోసం హయగ్రేవేష్టి జరుగనున్నాయి. అష్టోత్తర శతనామ పూజ ప్రవచన మండపంలో చినజీయర్ స్వామి సమక్షంలో కొనసాగనుంది.

ఇదీ చదవండి:

Last Updated : Feb 5, 2022, 12:35 AM IST

ABOUT THE AUTHOR

...view details