ఓట్లు, సీట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్... వరి ధాన్యం కొనమని చెబుతూ రైతులను నట్టేట ముంచుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండికేస్తూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో నియోజకవర్గ భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కందుకూర్లో జరిగిన సభకు హాజరయ్యారు. బండి సంజయ్ సమక్షంలో పలువురు స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు భాజపాలో చేరారు.
మండలానికి వంద మంది చొప్పున యువకులను అప్పగిస్తే తెరాస ప్రభుత్వాన్ని కూల్చి భాజపాను అధికారంలోకి తీసుకొస్తా అని బండి సంజయ్ తెలిపారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, భాజపా కార్యకర్తలపై దాడి జరిగినా సీఎం కేసీఆర్ ఏనాడు నోరుమెదలేదని విమర్శించారు. తాను భయంకరమైన హిందువని చెబుతూ ఎంఐఎంకి వంతపాడుతుండటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో అమరుల ఆశయాలకు భిన్నంగా నయా నిజాం, నియంత, అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు.