తెలంగాణ

telangana

ETV Bharat / state

Statue of Equality: వైభవంగా ముగిసిన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు.. 19న కల్యాణం - Statue of Equality

Statue of Equality: భగవత్ రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ వైభవంగా ముగిసింది. 12 రోజుల పాటు శోభాయమానంగా జరిగిన సహస్రాబ్ది వేడుకల్లో 216 అడుగుల సమతామూర్తి విగ్రహంతో పాటు బంగారు ప్రతిమను లోకార్పణం చేశారు. 108 ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యారాధనకు సిద్ధం చేశారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు.

Statue of Equality: వైభవంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు.. 19న కల్యాణం
Statue of Equality: వైభవంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు.. 19న కల్యాణం

By

Published : Feb 15, 2022, 5:25 AM IST

Updated : Feb 15, 2022, 6:49 AM IST

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు.. పలువురు ప్రముఖులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. రామానుజాచార్యుల విగ్రహం సహా బంగారు ప్రతిమను ఆవిష్కరించారు. ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణు సహస్ర పారాయణం చేశారు. యజ్ఞంలో భాగంగా యాగశాలలోని నాలుగు మండపాల్లో విశ్వక్సేనేష్టి, నారసింహఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్ఠి, హయగ్రీవఇష్టి, వైయూహికఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతేఇష్టిలను శాస్త్రోక్తంగా చేశారు. 1035 హోమ కుండాల్లో 5 వేల మంది రుత్వికులు.. లక్ష్మీనారాయణ మహా యజ్ఞాన్ని జరిపారు. చివరి రోజు ఆ యాగానికి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో రుత్వికులు మహా పూర్ణాహుతి పలికారు.

Statue of Equality: వైభవంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు.. 19న కల్యాణం

మంగళవారం నుంచి నేరుగా భక్తుల పూజలు..

యాగక్రతవులో భాగంగా సమతామూర్తి స్వర్ణ ప్రతిమ ప్రాణప్రతిష్ఠాపన చేసేందుకు యాగశాలలో ఆవాహన చేశారు. కుండలాల్లో నుంచి మండపంలోకి.. అక్కడి నుంచి కుంభంలోకి ఆవాహన చేసిన ఋత్వికులు.. శోభాయాత్రగా వెళ్లి భద్రవేది మొదటి అంతస్తులో కొలువైన రామానుజాచార్యుల బంగారు బింబంలోకి ప్రాణప్రతిష్టాపన చేశారు. యాగశాల నుంచి తీసుకొచ్చిన 1035 సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి స్వర్ణ విగ్రహానికి చినజీయర్ స్వామి కుంభాభిషేకం చేశారు. భక్తుల సమక్షంలో తొలి ఆరాధన చేసి హారతిచ్చారు. మంగళవారం నుంచి నేరుగా భక్తులు సువర్ణమూర్తికి పూజలు, నైవేధ్యాలు సమర్పించుకోవచ్చు.

చరిత్రలో గుర్తుండేలా.. 19న కల్యాణం..

వేడుకల్లో భాగంగా 108 వైష్ణవ ఆలయాల్లో జరపాల్సిన శాంతి కల్యాణాన్ని వాయిదా వేశారు. లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో భాగస్వాములైన వేలాది మంది ఋత్వికులను సన్మానించేందుకు శాంతి కల్యాణాన్ని వాయిదా వేసినట్లు చినజీయర్​ స్వామి తెలిపారు. కల్యాణ మహోత్సవాన్ని చరిత్రలో గుర్తుండేలా.. ఈ నెల 19న నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రవచన మండపంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఋత్వికులను పంచలోహాలతో తయారు చేసిన సమతామూర్తి మెడల్​తో సత్కరించారు.

దేశ నలుమూలల నుంచి..

సహస్రాబ్ది వేడుకల్లో సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర బారులు తీరి దర్శించుకున్నారు. బంగారు ప్రతిమను చూసి ముగ్ధులయ్యారు. ఏ ఆటంకం లేకుండా ఉత్సవాలు ముగియగా.. 8 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 1200 మంది జీహెచ్​ఎంసీ సిబ్బంది, 380 అగ్నిమాపక సిబ్బంది, 25 ఆరోగ్య సిబ్బందితో పాటు వికాస తరింగిణి నుంచి 12 వేల మంది కార్యకర్తలు సహస్రాబ్ది వేడుకల్లో సేవలందించారు.

ఇదీ చూడండి: Statue of Equality: అవే రామానుజ సహస్రాబ్ది వేడుకలకు వన్నె తెచ్చాయి: చినజీయర్​ స్వామి

Last Updated : Feb 15, 2022, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details