Shivraj Singh Chauhan Comments on meditation: దేశంలో కన్హా శాంతివనం లాంటి ధ్యాన కేంద్రాలను విస్తరించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో కన్హా ధ్యాన కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో మధ్యప్రదేశ్ సీఎం సతీసమేతంగా పాల్గొన్నారు. కాసేపు అక్కడే ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ధ్యాన కేంద్రం ఆవరణలో ఆశ్రమ గురూజీ కమలేశ్ పటేల్(దాజీ)తో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ఇలాంటి ధ్యాన కేంద్రాలను విస్తరిస్తే మానవులతో పాటు పశు పక్షాదులకూ ఎంతో మేలు కలుగుతుందని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. తద్వారా మంచి వాతావరణం నెలకొంటుందన్నారు. రెండు రోజుల పాటు ఈ ఆశ్రమంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం వివరించారు.
ప్రతి ఒక్కరు ధ్యానం, యోగా అలవరుచుకోవాలి.. దైనందిన జీవితంలో మనం ధ్యానం, యోగా అలవర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయని శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. సహజ్ మార్గ్ ఆధ్యాత్మిక సంస్థ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనాన్ని శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు సందర్శించారు. ప్రశాంత వాతావరణం నడుమ సమావేశం మందిరంలో వేల సంఖ్యలో అభ్యసించే సమయంలో రామచంద్ర మిషన్ నిర్వాహకులు, ప్రఖ్యాత యోగా గురువు కమలేశ్ పటేల్(దాజీ)తో కలిసి చౌహాన్ దంపతులు గంటపాటు ధ్యానం చేశారు.
ఈ సందర్భంగా "నశా ముక్తి అభియాన్ కార్యక్రమం"పై "ఎస్ ఐ కెన్" పేరిట ఓ పుస్తకం, మొబైల్ యాప్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. మద్యం, మాదక ద్రవ్యాలు, సిగరేట్ వంటి వ్యసనాలకు బానిసలైన చెడుమార్గంలో నడుస్తున్న యువత, ఇతర వర్గాలను బయట పడేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. దేశంలో తొలి హార్ట్‌ఫుల్‌నెస్ రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: