తెలంగాణలోని వైఎస్‌ఆర్ అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్న ఆమె... భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు. దీనికి ముఖ్యులంతా హాజరయ్యేలా ఏర్పాట్లుచేస్తున్నారు.
మార్చి 2న మరోసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో సమావేశం కావాలని నిర్ణయించిన షర్మిల, ఈ సందర్భంగా వైఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోనున్నారు. తక్కువ నిధులతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశమున్నా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఇప్పటికే కొందరు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.