Santhi Kalyanam : సమతామూర్తి కేంద్రంలో కమనీయ ఘట్టం ఆవిష్కృతమైంది. 108 దివ్యదేశాల్లో కొలువైన భగవన్మూర్తులకు ఏకకాలంలో అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ముచ్చింతల్‌లోని దివ్యసాకేత క్షేత్రంలో శాంతి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆయా క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులను రుత్వికులు సమతామూర్తి కేంద్రానికి చేరుకునే ఉజ్జీవన సోపానం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడే 14 మెట్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. సాయంత్రం 6.35 గంటలకు కల్యాణ క్రతువు చేపట్టారు. సీతాసమేత కోదండరాముడిని మొదటి మెట్టుపై కొలువుదీర్చారు. రాత్రి 8.12 గంటలకు అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేయించారు. ఈ వేడుకను కనులారా చూసి భక్తజనం తరించింది. వేదపండితులు కల్యాణోత్సవం చేస్తుండగా.. ఆ క్రతువు విశేషాలను చినజీయర్‌స్వామి భక్తులకు హిందీ, తెలుగులో ఎప్పటికప్పుడు వివరించారు. చివరిగా 108 మంది దేవతామూర్తులను అనుసంధానం చేస్తూ దివ్యదేశాల పేర్లు, భగవన్మూర్తుల పేర్లను భక్తులతో పలికించారు. కల్యాణ అక్షతలను ప్రత్యేకంగా 60 కౌంటర్లలో భక్తులకు అందించారు. కార్యక్రమంలో అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్‌స్వామి, మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, జీయర్ ట్రస్టు ప్రతినిధులు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 మంది చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
కేసీఆర్ సంపూర్ణ సహకారం మాకుంది..