TSRTC Income : సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు క్యూ కట్టారు. దీంతో బస్టాండ్లు, బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సంక్రాంతికి ఆర్టీసీ పక్కా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లింది. దసరాకు సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేసిన ఆర్టీసీ.. ఈసారి కూడా అధనపు ఛార్జీలు వసూలు చేయలేదు. సాధారణ ఛార్జీలనే తీసుకుంటున్నామని... ప్రజల్లో అవగాహన తీసుకువచ్చింది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేయడం టీఎస్ఆర్టీసీకి కలిసి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 14 వరకు ఆర్టీసీ 3,400 బస్సులను నడిపించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 1000 బస్సులు, మిగిలిన 2,400 బస్సులను తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు తిప్పింది.
సురక్షితంగా గమ్యస్థానాలకు
ఈ నెల 7 న 243 బస్సులు, 8 న 827 బస్సులు, 9 న 355 బస్సులు, 10 న 325 బస్సులు, 11 న 354 బస్సులు, 12 న 566 బస్సులు, 13 న 567 బస్సులు, 14 న 171 బస్సులు నడిపించారు. ఈ బస్సుల ద్వారా సుమారు 20 లక్షల మందిని సొంతూళ్లకు క్షేమంగా చేరవేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటితో పాటు నిత్యం సాధారణంగా తిరిగే 4,600 బస్సుల ద్వారా మరో 1.50 లక్షల మందిని సొంతూళ్లకు చేరవేసినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతి సీజన్లో 22 లక్షల పైచిలుకు మందికి సురక్షిత ప్రయాణం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.