RSS Meeting: హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ సమీపంలోని అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యాకేంద్రంలో రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ విజయవంతంగా ముగిసింది. ఈనెల 5 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేతో పాటు ఐదుగురు సహ సర్ కార్యవాహలు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న 36 సంస్థలకు చెందిన 216 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, ఆర్థిక అంశాలతోపాటు వ్యవసాయ రంగం, రైతులు, కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
పలు అంశాలపై చర్చ
ప్రత్యేకించి నరేంద్రమోదీ సర్కారు ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం, ఉద్యోగ, ఉపాధి కల్పన, గ్రామీణులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను వేధిస్తున్న సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా 6 వేల బ్లాకుల్లో 10 లక్షల మందికి పైగా కార్యకర్తలకు కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో శిక్షణ ఇచ్చినందున.. అంతా సిద్ధంగా ఉన్నామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత సంయుక్త కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు.
స్వాతంత్ర సమరయోధుల చరిత్రపై..
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన వేళ మరుగునపడిన 250 మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వెలికితీయనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. ఏ కొందరి వలన స్వాతంత్య్రం రాలేదని.. స్వాతంత్ర సమరంలో చాలా మంది భాగస్వామ్యం ఉందని.. వివిధ వర్గాలతోపాటు ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని ఈ బైఠక్‌లో ప్రస్తావనకు వచ్చింది. సంస్కార భారతి నాటకాల రూపంలో ఆర్‌ఎస్ఎస్, ఇతర సేవా సంస్థలు ఆ యోధులపై ప్రచారం చేస్తున్న తరుణంలో ఆ గాథలు పుస్తక రూపంలో ప్రజలకు పరిచయం చేయాలని నిర్ణయించింది. కొవిడ్ మూలంగా శాఖ కార్యక్రమాలు తాత్కాలికంగా ఆగినప్పటికీ తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకొన్నాయి.