మహానగరంలోని కీలక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే పలు అవరోధాలు ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు.. వాహనదారులకు ప్రత్యామ్నాయాలను చూపడం.. ఒక్కోసారి కేవలం రాత్రి వేళ మాత్రమే పనులు చేయాల్సి రావడం ఇలా ఎన్నో.. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ సమయాన్ని జీహెచ్‌ఎంసీ సద్వినియోగం చేసుకుంది.
రహదారులన్నీ ఖాళీగా ఉండడంతో మార్చి 23 నుంచి మే నెలాఖరు వరకు మూడు వంతెనల పనులు చకచకా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చింది. మరో రెండు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, వాటిని నెలాఖరులో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
9 నుంచి 10 నెలల్లో పూర్తయ్యే పనులు 69 రోజుల్లో జరిగాయని గుర్తు చేస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ‘వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)’ పనులకు మూడేళ్ల కిందట బీజం వేశారు. పలు పైవంతెనలు, అండర్‌పాస్‌లు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. త్వరలో దుర్గంచెరువు తీగల వంతెన, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 ఎలివేటెడ్ కారిడార్, బైరామల్‌గూడ కూడలి కుడివైపు పైవంతెన అందుబాటులోకి రానున్నాయి.
లాక్‌డౌన్ వేళ.. కొన్ని ప్రధానమైన పనులకు వ్యయం..
- బైరామల్‌గూడ కుడి, ఎడమవైపు పైవంతెనలు: రూ.2.25 కోట్లు
- ఒవైసీ ఆసుపత్రి కూడలి పైవంతెన: రూ.2.04 కోట్లు
- బహదూర్‌పుర కూడలి పైవంతెన: రూ.3.15కోట్లు
- బయోడైవర్సిటీ కూడలి మొదటిస్థాయి పైవంతెన: రూ.4.45కోట్లు
- జూబ్లీహిల్స్ రోడ్డు నం.45లోని కారిడార్: రూ.6.79కోట్లు ఓయూ కాలనీ పైవంతెన: రూ.11.43 కోట్లు
- కొత్తగూడ పైవంతెన: రూ.12.79 కోట్లు
- దుర్గంచెరువు తీగల వంతెన: రూ.1.55 కోట్లు
- పంజాగుట్ట శ్మశాన వాటిక ఉక్కు వంతెన: రూ.2.89 కోట్లు
ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!