Road Accident at ORR Service Road: నిత్య జీవితంలో ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరని పెద్దల వాదన. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం మంచిగానే వాహనం నడుపుతున్నా.. ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా.. కొన్ని సార్లు ఇతరులు చేసినా తప్పులకు ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వీటిపై అధికారులు, పోలీసులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించానా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా వారు ప్రమాదాల బారిన పడటంతో పాటు వేరే కుటుంబాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉమర్ఖాన్ గూడ నుంటి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ సర్వీస్ రోడ్లో ఓ కారు అదుపుతప్పి ఫుట్పాత్ ఢీకొని బోల్తా పడింది. ఈ క్రమంలోనే సదరు వాహనం విద్యుత్ స్తంభానికి దగ్గరగా నిలిచిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయినట్లుగా గుర్తించారు. కారు వెళ్లి గోడను ఢీకొనడంతో డ్రైవర్ బయటపడి తలకు, ఇతర శరీర భాగాలకు గాయాలపై అక్కడికక్కడే చనిపోయాడు.
చనిపోయిన వ్యక్తిని 19 ఏళ్ల రేవంత్గా గుర్తించారు. మృతుడు హయత్ నగర్ శ్రీసాయి కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇబ్రహీంపట్నంలోని స్నేహితులను కలిసేందుకు తండ్రి బ్రీజా కారు TS09FM7501లో బయలుదేరి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీదుగా వెళ్తుండగా.. కోహెడ దాటిన తరువాత ఉమర్ ఖాన్ గూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు పోస్టుమార్టమ్ కోసం తరలించారు.