రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు చెట్టును ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. మృతులు ఆలూరు మండలానికి చెందిన రాఘవేందర్, నరేశ్, రవిందర్గా గుర్తించారు.
అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నప్పటినుంచి ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన ఎన్కతల రాఘవేందర్(30) వికారాబాద్ జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. సార నరేశ్ (30) బీటెక్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. గారెల రవీందర్(32) ప్రైవేట్ ఉద్యోగి, నరుకొండ నవీన్ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
ఆదివారం నరేశ్ కారులో చేవెళ్లకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా మీర్జాగూడ గేటు సమీపంలో కారు అతి వేగంతో రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టుకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు బలంగా చెట్టును ఢీకొనడం వల్ల కారులో ఇరుక్కుపోయి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు జేసీబీ సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.