తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరుగుతున్న గుడ్డు వినియోగం.. కోలుకుంటున్న పౌల్ట్రీ పరిశ్రమలు

గడిచిన 18 నెలలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈనెల మొదటి వారం నుంచి కోడి గుడ్డు ధర గిట్టుబాటు ధర కంటే పెరగటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమకు భవిష్యత్తులో మనుగడ ఉంటుందని భావించి ముందడుగు వేస్తున్నారు. రవాణా లేకపోయినా స్థానిక వినియోగం పెరగడం, డిమాండుకు తగిన స్థాయిలో గుడ్ల ఉత్పత్తి లేకపోవడం ధర పెరుగుదలకు కారణం అవుతోంది. పెరిగిన ధరలు నెలల తరబడి కొనసాగితే తప్ప పౌల్ట్రీ కోలుకోలేదని రైతులు చెబుతున్నారు. దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో కూడిన గోదావరి జోన్ గుడ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నా పరిస్థితులు మాత్రం భిన్నంగానే ఉన్నాయి. వరుస నష్టాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతులపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

Rising egg consumption .. Poultry industries recovering
ఏపీ: పెరుగుతున్న గుడ్డు వినియోగం.. కోలుకుంటున్న పౌల్ట్రీ పరిశ్రమలు

By

Published : Sep 24, 2020, 10:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా పాడి పశువుల పెంపకానికి ప్రత్యామ్నాయంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. 40, 45 ఏళ్ల కిందటి వరకు వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పశువులు పెంచేవారు. పశువుల పెంపకం భారం కావటంతో క్రమేపీ పశువుల స్థానం కోళ్ల పరిశ్రమలను ఏర్పాటుచేసి విస్తరించుకుంటూ వచ్చారు. మొదట్లో పౌల్ట్రీ పరిశ్రమపై చెప్పుకోదగ్గ లాభాలే వచ్చేవి.

18 నెలలుగా సంక్షోభం

అయితే గడిచిన 18 నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2019వ సంవత్సరంలో మొక్కజొన్న దాణా రేటు కిలో రూ. 17 రూపాయల నుంచి రూ. 24 రూపాయలకు చేరింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాణా రేటు పెరిగిపోయి తదనుగుణంగా గుడ్డు గిట్టుబాటు ధర పెరిగింది. ఆ స్థాయిలో మార్కెట్ ధర పెరగకపోవటంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పరిశ్రమ కోలుకునే అవకాశం ఉంటుందని భావించారు. అయితే కోడిగుడ్డు, కోడి మాంసం తింటే కరోనా వస్తుందనే వదంతులు పౌల్ట్రీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా ఫిబ్రవరిలో కోడి గుడ్డు ధర అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇది రైతుల్ని మరింత డీలా పడేలా చేసింది. మార్చి నెలలో మొదలైన లాక్ డౌన్ రైతుల పాలిట శాపంగా మారింది. జూన్ నెల వరకు దుర్భర పరిస్థితులు కొనసాగాయి. అప్పటి నుంచి పరిస్థితులు కొంత మెరుగుపడి ఆగస్టు చివరి వారంలో గుడ్డు ధర పెరిగింది. గుడ్డు ధర పెరిగినా వచ్చే మిగులు కనీసం వడ్డీలకు కూడా సరిపోదని రైతులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం ఫర్వాలేదు

ప్రస్తుతం ఉత్పత్తి తక్కువగా, వినియోగం ఎక్కువగా ఉండటంతో గుడ్డు ధర పెరిగింది. వల్ల వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల గుడ్డు ధర పెరిగింది. స్థానిక వినియోగం పెరగడం ధరలు పెరగడానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహారం పేరుతో కోడిగుడ్లను అంగన్వాడీలకు, పాఠశాలకు భారీ స్థాయిలో కొనుగోలు చేయడం వల్ల పరిశ్రమకు కొంత ఉపశమనం కలిగింది. ప్రస్తుతం కోడి గుడ్డు ధర పెరిగినా గత 18 నెలల కాలంలో కలిగిన నష్టాన్ని పూడ్చుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీ, సబ్సిడీ ధరకు మొక్కజొన్న సరఫరా వంటి సదుపాయాలు కల్పించి పరిశ్రమను ఆదుకోవాలని రైతులు, పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు.

నష్టాలు పూర్తిగా పోలేదు

పౌల్ట్రీలో గత నెలాఖరు వరకు ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కడానికి దీర్ఘకాలం పడుతుందనేది రైతుల అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న కోడిగుడ్డు ధరల ప్రకారం గుడ్డుకు 80 వరకు మిగిలినా.. ఈ ధర ఎంతకాలం ఉంటుందో తెలియదు. నష్టాలను భర్తీ చేసుకోవడానికి 9 నెలల నుంచి సంవత్సరం వరకు ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగాల్సిన అవసరం ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు.

పోషకాహారం పేరుతో కోడిగుడ్లను అధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు. సున్నా వడ్డీ రాయితీ కల్పించడంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో క్వింటాలు మొక్కజొన్న రూ. 1300 రూపాయలకి సరఫరా చేస్తున్న తీరులోనే ఆంధ్రప్రదేశ్ లోనూ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇతర రాయితీలు కల్పించి పరిశ్రమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి.. తొలి గాడిద పాల డెయిరీ- లీటరు రూ.7వేలు మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details