హైదరాబాద్ సాహెబ్‌నగర్ డ్రైనేజీలో పూడిక తీస్తూ మృతి చెందిన కార్మికులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం లోగా పరిహారం చెల్లించకపోతే జాతీయ స్థాయిలో అన్ని విభాగాలకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు సంబంధిత అధికారులు దిల్లీకి తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. సైదాబాద్ చింతల్‌బస్తీలో.. మృతి చెందిన మున్సిపల్ ఒప్పంద కార్మికులు శివ, అంతయ్య కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.
ఏడేళ్లుగా పైప్లైన్లలో పూడికను తీయకపోవడంతో హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతోంది. పూడిక తీత పనులు యంత్రాలతో తీయాలని చట్టం చేసినా.. మనుషులతో ఎలా పనిచేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో దళితులను మ్యాన్హోల్లోకి దింపి వారి చావుకు కారణమయ్యారు. తక్షణమే వారికి రూ. కోటి పరిహారం అందించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్