Revanth Announced Congress Youth Declaration : ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ను ప్రకటిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల ఉద్యమ కారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్ అని తెలిపారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. వారి కుటుంబాలకు రూ.25,000 పింఛన్తో పాటు.. అమరవీరులకు సముచిత గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని వివరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పోస్టులతో పాటు.. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఏటా జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న నియామక పత్రాలు లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4,000.. నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాగానే కమిషన్ను బలోపేతం చేస్తామని తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగా చేసి పారదర్శకంగా పోస్టుల భర్తీ చేస్తామని వివరించారు. సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకువస్తామని చెప్పారు. ఏడు జోన్లలో ఎంప్లాయ్‌మెంట్, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం: ప్రైవేట్ పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని పేర్కొన్నారు. విద్య, ఉపాధి సమస్యలపై యూత్ కమిషన్ ఏర్పాటు చేయనుట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు చట్టం తీసుకు వస్తామని అన్నారు. మోసం చేసే ఏజెంట్లను నియంత్రిస్తామని.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలను ప్రత్యేక సంస్థ ద్వారా భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.