రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోంది. కొవిడ్ కేసులు పెరుగుతుండగా... చౌకధరల దుకాణాల ద్వారా నిత్యాసవర సరుకులు పంపిణీ చేసేందుకు డీలర్లు భయపడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కొరవడటమే కాకుండా ప్రజల అజాగ్రత్త... తమ ప్రాణాల మీదకు వస్తోందని పంపిణీ దారులు ఆవేదన చెందుతున్నారు. ఐరిస్ విధానం వల్ల... వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వాపోతున్నారు. పాత పద్దతిలోనే థర్డ్‌పార్టీ అథెంటికేషన్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని... చౌకధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం... పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లింది. ఎలాంటి స్పందన రాకపోగా... ఎట్టిపరిస్థితుల్లోనూ నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయని రేషన్ డీలర్లు వాపోయారు. మే నెలకు సరుకుల పంపిణీ చేపట్టగా... పరిస్థితులు ప్రాణాంతకంగా మారాయని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే 55 మంది రేషన్ డీలర్లు కరోనా భారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 15 వందల మందికిపైగా ఐసోలేషన్‌లో, 400 మంది ఆసుపత్రుల్లో కరోనా చికిత్స తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండో దశ దృష్ట్యా
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా... ప్రతి నెలా 87.54 లక్షల కుటుంబాలకు... 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. 17,400 చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం సహా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కొవిడ్ తొలిదశలో మూడు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీలో డీలర్లు కీలక పాత్ర పోషించారు. కరోనా రెండో దశ తీవ్రత దృష్ట్యా తమ కుటుంబ సభ్యుల్లో 45 ఏళ్ల వయసు దాటిన వాళ్లందరికీ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి ఉచితంగా టీకా ఇప్పటించాలని డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.