మే నెల మద్యం విక్రయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు అనంతరం మే 6న రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి నెల చివరి వరకూ (26 రోజుల్లో) రాష్ట్రవ్యాప్తంగా రూ.1968 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.478 కోట్ల విక్రయాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మే అమ్మకాల్లో ఇది దాదాపు 25 శాతం కావడం గమనార్హం.
మద్యం విక్రయాల్లో రంగారెడ్డి షాపులదే హవా.! - liquor sales are high in rangareddy district
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో మద్యం దుకాణాలు తెరుచుకున్న అనంతరం మందుబాబులు తెగ తాగేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే రూ.478 కోట్ల విక్రయాలు జరిగి రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
దుకాణాలు తెరిచిన మొదటి రెండు రోజులు పోలీసుల కాపలా మధ్య విక్రయాలు జరిపిన విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకే దుకాణాలను మూసివేసినా రోజుకు సగటున రూ.75 కోట్ల మేర విక్రయాలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా 26.5 లక్షల కేస్‌ల విస్కీ, 23.22 లక్షల కేస్‌ల బీర్ల విక్రయాలు జరిగాయి. సాధారణంగా మే నెలలో ఎండల కారణంగా బీర్ల విక్రయాలే అధికంగా సాగుతుంటాయి. అయితే మద్యం దుకాణాల దగ్గర పర్మిట్ రూంలు, బార్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించక పోవడం బీర్ల విక్రయాలపై ప్రభావం చూపింది.