Court Allows One Week Custody to Hariharakrishna: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవీన్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. నిందితుడు హరిహరకృష్ణను కస్టడీకి ఇవ్వాలని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు కోర్టుకు వివరించారు. అయితే తాజాగా ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు హరిహరకృష్ణను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. వారంరోజుల పాటు హరిహరకృష్ణకు పోలీసు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నిన హరిహరకృష్ణ స్నేహితుడు అనే కనికరం కూడా లేకుండా నవీన్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యకేసులో నిందితుడు అయిన హరిహరకృష్ణ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు.