Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా.... రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. ఆధునిక వసతులు, సాంకేతిక సౌకర్యాలతో కూడిన నూతన భవనాన్ని రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
మా నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నంలో రామోజీ ఫిలిం సిటీ ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. రామోజీ ఫౌండేషన్ ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో చేస్తున్న శుభ సందర్భంలో నేను చాలా గర్వపడుతున్నాను. గ్రామీణ అభివృద్ధి కోసం రామోజీ సంస్థ... ఫౌండేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తోంది. ఈ నాగన్‌పల్లి ఊరిని దత్తత తీసుకొని... వివిధ రకాల అభివృద్ధి పనులు చేసేందుకు సహకారం అందించిన రామోజీరావు గారికి ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో అభివృద్ధిలో వాళ్లు మొదటిదశలో పనిచేస్తున్నందున వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
-మంచిరెడ్డి కిషన్ రెడ్డి, శాసనసభ్యుడు
రామోజీ ఫౌండేషన్.... నాగన్‌పల్లి గ్రామాన్ని 2016లో దత్తత తీసుకుంది. అప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దాదాపు రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
మా నాగన్‌పల్లి గ్రామ చరిత్రలో ఒక మంచిరోజు. రామోజీ ఫౌండేషన్ ద్వారా మా నాగన్‌పల్లిలో... గ్రామానికే తలమానికగా నిలిచే విధంగా మెయిన్ రోడ్డులో పంచాయతీ పాత భవనాన్ని తీసేసి... జీప్లస్2 నూతన భవనాన్ని మాకు కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా గ్రామాన్ని దత్తత తీసుకొని... ఊరు సర్వతోముఖాభివృద్ధికి రామోజీ ఫౌండేషన్ పాటుపడడం మా అదృష్టంగా భావిస్తున్నాం.