తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాగన్‌పల్లి దేశంలోనే అత్యుత్తమ ఆదర్శ గ్రామంగా మారబోతోంది..'

రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామం నాగన్‌పల్లి దేశంలోనే అత్యుత్తమ ఆదర్శ గ్రామంగా మారబోతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆ గ్రామంలో.. ఇప్పటికే 70 కోట్లకుపైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన రామోజీ ఫౌండేషన్... ఊరిలోని ప్రతి మహిళకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే సేంద్రీయ విధానంతో వివిధ రకాల కూరగాయలను పండిస్తూ... నెలకు లక్షకు పైగా ఆదాయాన్ని మహిళలు పొందుతున్నారు. తాజాగా పాడి రైతులకు మేలు చేకూరేలా నాగన్‌పల్లి బ్రాండ్ పేరుతో పాలు, వాటి ఉత్పత్తులు విక్రయించేందుకు డెయిరీని ఏర్పాటుచేస్తోంది.

Ramoji Foundation Adopted Village Naganpally Special story
Ramoji Foundation Adopted Village Naganpally Special story

By

Published : Jun 18, 2022, 3:09 AM IST

Updated : Jun 18, 2022, 5:27 AM IST

నాగన్‌పల్లి దేశంలోనే అత్యుత్తమ ఆదర్శ గ్రామంగా మారబోతోంది

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి.. దేశానికే తలమానికంగా నిలువనుంది. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషిచేస్తున్న రామోజీ ఫౌండేషన్.... 17 కోట్ల 40 లక్షల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. ఆరున్నర కోట్లతో కార్పొరేట్‌ స్థాయిలో రూపుదిద్దుకున్న ప్రభుత్వపాఠశాలలో ప్రస్తుతం 400 మందికిపై విద్యార్థులు పదోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు. కోటి రూపాయలకు పైగా వ్యయంతో గ్రామపంచాయతీ భవనం, 25 లక్షలతో ఆర్వో ప్లాంట్, ఇంటింటికి మరుగుదొడ్డి, విద్యుత్ స్తంభాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం, మహిళా సంఘాలకు భవనాలు, బస్‌షెల్టర్ సహా... రహదారికి ఇరువైపుల పచ్చదనం ఉండేలా గ్రామాన్ని తీర్చిదిద్దింది. అంతేకాకుండా ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్‌ అందించి సాంకేతికతపై అవగాహన కల్పించింది. నిరక్షరాస్యులకు చదువు చెప్పిస్తూ.... అక్షరాస్యులుగా మారుస్తోంది.

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలు మార్చిన రామోజీ ఫౌండేషన్.. స్థానికులందరికీ ఉపాధి కల్పించడంతోపాటు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రొత్సహించే ఉద్దేశంతో "యాక్సిస్ లైవ్లీహుడ్స్ సంస్థ"తో కలిసి "నాగన్​పల్లి మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ"ని ఏర్పాటుచేసింది. రెండేళ్లక్రితం 85 మందితో ప్రారంభమైన ఆ కంపెనీలో ప్రస్తుతం 187 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. వారందరికి రుణాలు, సేంద్రీయ ఎరువులు అందించి సుమారు 15 రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. ఆలుగడ్డ సాగు విఫలమవుతుందన్న వాదనల నడుమ పలువురు రైతులు 15 ఎకరాల్లో ఆలుగడ్డ పండించి ఒక్కో ఎకరానికి 50 వేల ఆదాయం పొందారు. ఆ విధంగా నాగన్‌పల్లి కూరగాయలకు నగరంలో మంచి గిరాకీ ఉండటంతో వచ్చే రెండేళ్లలో 22 రకాల కూరగాయలు పండించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. నాగన్‌పల్లి మహిళ ప్రొడ్యూసర్ కంపెనీ తమకు అండగా ఉండటం ఎంతో ఆర్థిక భరోసానిస్తోందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పాడిపంటల అభివృద్ధిలోనూ రామోజీ ఫౌండేషన్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక్కడి నేలలకు భూసారపరీక్షలు చేయించి ఏ పంటలు పండుతాయో అందుకు అనుగుణంగా పంటప్రణాళికలను తయారు చేశారు. కొత్త పంటల సాగుతోపాటు చామదుంప, ఆలుగడ్డ, టమాట సహా ఇతర కూరగాయలను సేంద్రీయ పద్దతుల్లో పండించి రైతుల పంటపొలాల వద్దే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, కలుపుతీసే యంత్రాలను తక్కువ మొత్తానికి అద్దెకిస్తూ చేయూతను అందిస్తున్నారు.

అలాగే గ్రామంలోని పాడి రైతులకు మేలు జరిగేలా ప్రత్యేక డెయిరీని ఏర్పాటుచేస్తున్నారు. 5 ఎకరాల భూమి లీజుకుతీసుకొని 3 కోట్లతో డెయిరీని నిర్మిస్తున్నారు. నాగన్‌పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పాలు సేకరించి నాగన్‌పల్లి బ్రాండ్ పేరిట విక్రయించేలా కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో రెండు నెలల్లో డెయిరీని ప్రారంభించనున్నట్లు రామోజీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆ డెయిరీ ప్రదేశంలో కొంతభాగంలో 15 రకాల పశుగ్రాసాలను సాగుచేసి రైతులకు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

పాడి పశువులను పెంచుకోవాలనే పేద రైతుల కోసం రామోజీ ఫౌండేషన్ మరో నిర్ణయం తీసుకుంది. ప్రియాడెయిరీలోని ఆవు, గేదెదూడలను నాగన్‌పల్లి రైతులకు ఉచితంగా అందించి పశుపోషణకు సహకారం అందిస్తామని ప్రకటించింది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 18, 2022, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details