Sahasrabdi Vedukalu Third day : జగద్గురు శ్రీ రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు మూడో రోజు అష్టాక్షరీ మంత్ర అనుష్టానంతో ప్రారంభమయ్యాయి. శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రధాన యాగశాల మండపంలో 9 మంది జీయర్ స్వాములు మంత్ర అనుష్టానం చేశారు. సుమారు గంటపాటు ఈ మంత్ర అనుష్టానం జరిగింది. ఈ అనుష్టానం వల్ల మన చుట్టూ ఉండే వాతావరణం పవిత్రమవుతుందని చిన్నజీయర్ స్వామి తెలిపారు. ప్రేమతో ఈ మంత్ర అనుష్టానం చేయడం వల్ల భక్తుల్లో మానసిక బలం కలుగుతుందన్నారు. అయితే ఈ మంత్ర అనుష్టానం చేసేటప్పుడు యాగశాల ఆవరణలో వాహన శబ్దాలు చేయడం వల్ల ఆచార్యుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని, నిర్వాహకులు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
అష్టోత్తర శతపూజ ప్రారంభం
ramanujacharya Sahasrabdi celebrations : అలాగే ప్రధాన మండపం వద్ద ఒకే చోట కూర్చునే భక్తులు... యాగశాలలోని మిగతా మండపాల వద్ద కూడా కూర్చోవచ్చునని సూచించారు. ఋత్వికులు చేసే యాగం చూడటంతోపాటు వేదాలు, హితహాస పారాయణాలు చేసుకోవచ్చని చిన్నజీయర్ స్వామి వివరించారు. లక్ష్మినారాయణ మహాయాగం క్రతువు ముగిసే వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ యాగానికి ముందు ప్రధాన జీయర్ స్వాములు.. యాగశాలలో నారాయణ అనువాకం, వేదాది అవయవధారను కొనసాగిస్తున్నారు. మరోవైపు యాగశాల సమీపంలోని ప్రవచన మండపంలో అష్టోత్తర శతపూజను చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు.