తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramanuja Sahasrabdi Utsav: శోభాయమానంగా రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు - చినజీయర్​ స్వామి వార్తలు

Ramanuja Sahasrabdi Utsav: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ సమీపంలోని శ్రీరామనగరం సమతామూర్తి కేంద్రం జనసంద్రమైంది. రామానుజాచార్యుల విగ్రహం లోకార్పితం కావడంతో ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది నుంచి భక్తులు, సందర్శకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఫలితంగా శ్రీరామనగరం జాతరను తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నేడు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

Ramanuja Sahasrabdi Utsav
Ramanuja Sahasrabdi Utsav

By

Published : Feb 7, 2022, 5:33 AM IST

Ramanuja Sahasrabdi Utsav: శోభాయమానంగా రామానుజ సహాస్రాబ్ది ఉత్సవాలు..

Ramanuja Sahasrabdi Utsav: జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఐదో రోజు సమతామూర్తి కేంద్రం భక్తులతో కిటకిటలాడింది. ఓ వైపు యాగశాలలో నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ మహాయాగం కొనసాగుతోంది. మరోవైపు సమతామూర్తి విగ్రహాన్ని వీక్షించేందుకు భారీసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీరామనగరం ఎక్కడ చూసినా సందడిగా మారింది.

మొదటి నాలుగు రోజులు సాధారణ భక్తులను అనుమతించలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణతో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. అయితే సందర్శకులను కేవలం విగ్రహం వరకు మాత్రమే అనుమతించారు. 108 దివ్యదేశాల ఆలయాల ప్రతిష్టాపన పూర్తికాకపోవడం వల్ల అటువైపు ఎవరిని వెళ్లనివ్వలేదు. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన భక్తులు.. దివ్యదేశాల ప్రాణప్రతిష్ట తర్వాత మరోసారి వచ్చి పూర్తిగా వీక్షిస్తామని చెబుతున్నారు.

ఏకధాటిగా మహాక్రతువు..

రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా యాగశాలలో తొలుత పరమేష్ఠి యాగాన్ని నిర్వహించారు. తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ యాగాన్ని నిర్వహించినట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ఈ యాగాన్ని ఐదువేల మంది రుత్వికులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పితృదేవతల తృప్తి కోసం, పితృ దోష నివారణ కోసం వైభవేష్టి హోమాలను నిర్వహించారు. నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ 114 యాగశాలలో 1035 హోమ గుండాల్లో ఏకధాటిగా లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతుంది.

హాజరైన జొన్నవిత్తుల..

ఇక ప్రవచన మండపంలో వేద పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. సుమారు 300 మంది భక్తులు.. శ్రీరామ అష్టోత్తర శతనామ పూజలో పాల్గొనగా ఆ పూజా ఫలితాన్ని దేవనాథ రామానుజ జీయర్ స్వామి భక్తులకు వివరించారు. అనంతరం సింహాచలం స్థానాచార్యులు టీవీ రాఘవాచార్యులు.. భగవద్రామానుజుల వైభవాన్ని వివరించారు. ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రామనుజాచార్యుల విశిష్టతలను పాటల రూపంలో ఆవిష్కరిస్తూ భక్తులను ఆకట్టున్నారు.

నేడు ఏపీ సీఎం రాక..

సమతామూర్తి కేంద్రానికి అతిథుల రాక పెరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​, తితిదే ఈవో జవహర్​రెడ్డి, ఇక్ఫాయ్ వైస్ ఛాన్సలర్ జగన్నాథన్ పట్నాయక్, మాజీ డీజీపీ అరవిందరావు, రాజస్థాన్ నుంచి జగద్గురు రామచంద్రార్య స్వామిజీ, బిహార్ నుంచి జగద్గురు స్వామి వెంకటేశ ప్రపన్నాచార్యజీ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రామానుజాచార్యుల వైభవాన్ని చాటేలా జరుగుతున్న సహస్రాబ్ది ఉత్సవాల పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

ప్రకృతి పరిరక్షణ కోసం..

సకాలంలో వర్షాలు కురవాలని, ప్రకృతి పరిరక్షణ కోసం, సస్య వృద్ధికి నేడు వైయ్యూహికేష్టి హోమాన్ని నిర్వహించనున్నారు. ప్రవచన మండపంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామపూజను చినజీయర్​ స్వామి నిర్వహించనున్నారు.

ఇదీచూడండి:Pawan Kalyan Visit Samathamurthi Statue: సమతామూర్తి క్షేత్రాన్ని సందర్శించిన పవన్​కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details