Rain updates in Rangareddy district : రాష్ట్రంలో ఏర్పడినఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వానలు దంచికొడుతున్నాయి. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరులోని కాగ్నా, కొకట్, గాజీపూర్, బెల్కటూరు, రాంపూర్ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
తాండూరులో స్థానికులకు ఎదరువుతున్న సమస్యలను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు యాలాల మండలం గోవిందరావుపేట, పెద్దేముల్ మండలం గాజీపూర్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వికారాబాద్ జిల్లా దోర్నాల వాగు ఉద్ధృతి కారణంగా నాగారం, అంపల్లి, గురుదొట్ల, రాస్నం, పగిడాల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఆయా గ్రామాల ప్రజలు వాగు దాటకుండా పోలీసులు, రెస్క్యూ అధికారులు కాపలా కాస్తున్నారు. పడిగ్యాల్, మోమిన్‌కలాన్, మైలారం గ్రామాలకు కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. స్టేషన్ థారూర్ వద్ద మూసినది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో థారూర్, యాలల మండలాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం ధాటికి మోమిన్‌పేట మండలం కేసారంలో మైబెల్లి శివయ్య ఇల్లు దెబ్బతినగా.. నవాబుపేట మండలం పుల్మామిడిలో శివరాజమ్మ ఇల్లు కూలిపోయింది. కూలిన ఇంటిని డీఎల్పీ అనిత, మండల అధికారులు పరిశీలించారు.