రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురింది. ఈదురు గాలి, వర్షం ప్రభావంతో... కొహెడ పండ్ల మార్కెట్‌లో షెడ్ కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రంగా గాయలు కావడం వల్ల వారిని తక్షణమే సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తాత్కాలిక రేకుల షెడ్లు ఒక్కసారిగా కురిసిన వర్షానికి కుప్పకూలాయి. మామిడి రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు పరుగులు తీశారు. ఎడతెరిపి లేకుండా 20 నిమిషాలపాటు గాలి, వర్షం ధాటికి నిలవ నీడ లేక తలదాచుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రేకులన్నీ లారీలపై పడ్డాయి.
కొహెడ మార్కెట్‌లో ఈదురుగాలుల బీభత్సం - rain latest news
రంగారెడ్డి జిల్లా కొహెడ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. పండ్ల మార్కెట్‌లో షెడ్లు కూలి ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది ఆచూకీ లేకపోవడం వల్ల రైతులు, కమీషన్ ఏజెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా హడావిడిగా గడ్డిఅన్నారం నుంచి కొహెడకు మార్కెట్ తరలింపులో ఉన్న ఉత్సాహం సౌకర్యాల కల్పనలో లేకపోవడం పట్ల మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచీ చెబుతున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.