కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న వలస కూలీలకు దాతల సాయంతో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లోని కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇటుకల బట్టీలు, మార్బుల్స్, భవన నిర్మాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులు లాక్డౌన్ నేపథ్యంలో తమ ఇళ్లకు వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.
దాతల సాయంతో వలస కూలీలకు వసతి గృహాలు: సీపీ మహేశ్ భగవత్ - వలస కూలీలు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాతల సాయంతో వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఊళ్లకు వెళ్లాలనే నిర్ణయాన్ని విరమించుకుని లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.
బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటున్న వారు ఎక్కడికీ వెళ్లొద్దని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన 200 మంది వలస కూలీలకు బాలాపూర్ తదితర ప్రాంతాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వారంటైన్లో ఉన్న వారు 21 రోజులు బయటికి వెళ్లకుండా ఉండాలని నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి