తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా టెస్టుల కోసం బారులు.. రద్దీగా ఏరియా ఆస్పత్రులు - vanasthalipuram area hospital news

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే అనుమానితులు వైరస్‌ నిర్ధరణ పరీక్షల కోసం ఆస్పత్రుల వద్ద బారుల తీరుతున్నారు. కానీ సామాజిక దూరం పాటించకుండా టెస్టులు చేయించుకుంటున్నారు. దీంతో వేరే అనారోగ్య కారణాల వల్ల వచ్చే రోగులు కూడా మహమ్మారి బారిన పడే పరిస్థితి నెలకొంది.

corona tests in area hospital vanasthalipuram
వనస్థలిపురంలో ఏరియా ఆస్పత్రిలో కరోనా టెస్టులు

By

Published : Apr 16, 2021, 3:48 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా రోజురోజుకీ పంజా విసురుతోంది. వైరస్‌ లక్షణాలతో అనుమానితులు రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి బారులు తీరుతున్నారు. ఆర్టీపీసీఆర్ ఫలితాలు వెంటనే రాకపోవడంతో చాలామంది రాపిడ్ పరీక్షల కోసం వస్తున్నారు. సోమవారం నుంచి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం 250 మందికి మించి అనుమానితులు ఆస్పత్రికి వస్తున్నారు. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

నో సోషల్‌ డిస్టెన్స్‌..

ఇదిలా ఉండగా కరోనా పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చే వారు మాత్రం సామాజిక దూరం పాటించడం లేదు. ఒకేసారి ఓవైపు జనరల్ ఒపీ, మరోవైపు కరోనా టీకా, ఇంకో వైపు కొవిడ్ టెస్టుల కోసం వచ్చే వారితో ఆస్పత్రి ఆవరణ రద్దీగా మారుతోంది. వైద్య సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఇచ్చి పంపిస్తున్నారు.

టెస్టుల కోసం ఇబ్బందులు..

ఇప్పటికే కొందరు ఆస్పత్రి వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది. ఎల్బీనగర్‌ నియోజకవర్గం మొత్తం వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండటంతో వ్యాక్సిన్, కరోనా టెస్టుల కోసం వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ రద్దీగా ఉంటోంది. గత ఐదు రోజుల వ్యవధిలోనే మహమ్మారితో వనస్థలిపురంలో నలుగురు, హయత్‌నగర్‌లో ఒకరు మృతి చెందారు.

చర్యలు తీసుకోవాలి..

మీర్‌పేట లెనిన్‌నగర్‌లోని ప్రాథమిక వైద్య కేంద్రంలోను కరోనా పరీక్షల కోసం అనుమానితులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:రైతు సంక్షేమమే కేసీఆర్ సర్కార్ ధ్యేయం : మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details