Manneguda Kidnap Case : రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శుక్రవారం పక్కా ప్రణాళిక ప్రకారం యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి.. యువతిపై దుష్ప్రచారం చేసేందుకు మొదటి నుంచీ కుట్ర పన్నాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసిన నవీన్ రెడ్డి.. ఆ ఖాతా ద్వారా వాళ్లిద్దరూ దిగిన ఫొటోలను పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
నవీన్ రెడ్డి క్రియేట్ చేసిన ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌పై ఆదిభట్ల పీఎస్‌లో అక్టోబర్ 10న కేసు నమోదు చేసి ఆదిభట్ల సీఐ నరేందర్ దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఫేక్ ఇన్‌స్ట్రాగ్రామ్‌కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. నిందితుడు నవీన్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన రఘుమారెడ్డి, మరో వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌ను నవీన్ రెడ్డి క్రియేట్ చేసినట్లు పూర్తి ఆధారాలు సేకరించారు.
దంత వైద్యురాలికి.. తనకు వివాహమైందని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసుకున్న నవీన్‌రెడ్డి.. ఎల్బీనగర్ కోర్టులో తన వివాహ విషయమై పిటిషన్ వేశాడు. ఎల్బీనగర్ కోర్టు నుంచి యువతి తండ్రికి నోటీసులు పంపించగా.. నవీన్ దుష్ప్రచారంపై ఎల్బీనగర్ పీఎస్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ పీఎస్‌కు వెళ్తే అది ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారన్నారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే సరిగ్గా స్పందించలేదని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్..: దంత వైద్యురాలి విషయంలో మొదటి నుంచీ నవీన్‌రెడ్డి సైకోగా వ్యవహరించాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. బ్యాడ్మింటన్ కోర్టు వద్ద యువతిని నవీన్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడని.. ఆ తర్వాత ఆమెని సొంతం చేసుకునేందుకు ఎన్నో డ్రామాలు ఆడాడన్నారు. పెళ్లయినట్లు నమ్మించేందుకు కుట్ర చేశాడని తెలిపారు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా దంత వైద్యురాలి పేరు రాయించిన నవీన్ రెడ్డి.. ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్ వేశాడన్నారు. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడని.. ఆ సమయంలో దంత వైద్యురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులు ఉన్నాయని స్పష్టం చేశారు.