Rude Behaviour LB Nagar Police Against a Woman : ఎంత పెద్ద కేసు అయినా.. నేరం రుజువు అయ్యేదాకా ఆ వ్యక్తిని నిందితుడిగానే న్యాయవ్యవస్థ పరిగణిస్తుంది. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కాపాడుతుంది. కానీ చిన్న చిన్న కేసుల్లోనూ.. విచారణ పేరుతో నిందితులను చావబాదుతున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో పోలీసు శాఖకు అప్రతిష్ఠ వస్తున్నా.. కొంతమంది పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో మరియమ్మ , ఖదీర్ ఖాన్ పోలీసుల థర్డ్ డిగ్రీతో ప్రాణాలు విడిచిన ఘటనలు మరువకముందే.. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఖాకీల కాఠిన్యానికి అద్దం పడుతోంది.
Two Constables Suspended LB Nagar Police Station : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మీర్పేట నందిహిల్స్కి చెందిన వరలక్ష్మి.. ఆగస్టు 15న రాత్రి ఇంటికి వెళ్లేందుకు మరో ఇద్దరితో కలసి ఎల్బీనగర్ కూడలి వద్ద ఉంది. ఆ సమయంలో అక్కడ గొడవ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో గస్తీ కాస్తున్న కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని.. వరలక్ష్మి సహా మరో ఇద్దరు మహిళలను స్టేషన్కి (LB Nagar Police Station) తీసుకెళ్లారు.
వారిపై 290 సెక్షన్ ప్రకారం.. పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదుచేశారు. తెల్లవారేవరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి పంపించారు. అయితే రాత్రి స్టేషన్కు తీసుకెళ్లడమే కాకుండా లాఠీలతో తననుకొట్టారని.. సెల్‌ఫోన్ లాక్కున్నారని బాధితురాలు వరలక్ష్మి ఆరోపించింది. ఈ ఘటనపై ఆమె తరఫు బంధువులు ఉదయం పోలీస్ స్టేషన్ ముందు అందోళనకు దిగారు. బాధితురాలిని పోలీసులు లాఠీతో కొట్టినట్లుగా గాయాలు కనిపిస్తున్నాయిని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలు నిజం కాదని ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి పేర్కొన్నారు.
దీనిపై ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ స్పందించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని.. విచారణ జరుపుతున్నామని వివరించారు. ఎల్బీనగర్ కూడలిలో ముగ్గురు మహిళలు గొడవ చేశారని చెప్పారు. గొడవపై సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారని పేర్కొన్నారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో పెట్రోలింగ్ సిబ్బంది మహిళలను పీఎస్‌కు తరలించారని అన్నారు. మహిళలపై ఐపీసీ 290 కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు. పోలీసులు తీవ్రంగా కొట్టారని మహిళలు చెబుతున్నారని తెలియజేశారు. బాధిత మహిళతో మాట్లాడామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.