Statue of Equality: భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తిని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. భద్రవేదిపై రామానుజాచార్యుల భారీ విగ్రహం వద్ద పూజలు చేసిన అనంతరం 3డీ టెక్నాలజీ సాయంతో మూర్తిని ఆవిష్కరించారు. అంతకు ముందు సాయంత్రం 5 గంటలకు మోదీ ముచ్చింతల్‌కు చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్‌లో సమతామూర్తి కేంద్రం చుట్టూ విహంగ వీక్షణం చేశారు. తర్వాత యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. విహంగ వీక్షణం సహా మోదీ పర్యటన ఆద్యంతం చినజీయర్‌స్వామి ఆయన వెంటే ఉండి క్షేత్రంలోని ప్రతి నిర్మాణం విశిష్టతలను వివరించారు.
విజయాన్ని కాంక్షిస్తూ విష్వక్సేనేష్టి
వసంత పంచమి పర్వదినం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేకంగా విష్వక్సేనేష్టిని నిర్వహించారు. ప్రధాని చేపట్టే అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో యాగం నిర్వహించగా, మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి ఆయనకు స్వర్ణకంకణాన్ని ధరింపజేశారు. అనంతరం విష్వక్సేనేష్టి పూర్ణాహుతిలో మోదీ పాల్గొని క్రతువును పూర్తి చేశారు. ప్రధానికి చినజీయర్‌స్వామి నెమలిపింఛాలతో కూడిన దండ వేసి ఆశీర్వచనాలు అందించారు. యాగశాలల నుంచి నేరుగా సమతామూర్తి కేంద్రానికి విచ్చేసిన మోదీ.. విగ్రహం చుట్టూ ఉన్న దివ్యదేశాలను సందర్శించారు. రామానుజాచార్యులకు స్ఫూర్తినిచ్చిన 106 ఆలయాలు, మరో రెండు పరమపదాలను కలుపుకొని ఆలయాలను నిర్మించినట్లు జీయర్ స్వామి తెలిపారు. ఎన్‌ఎఫ్‌సీ సాంకేతికతతో రూపొందించిన సెల్ఫ్ గైడెడ్ టూల్ సాయంతో ఒక్కొక్క ఆలయం వద్దకు చేరుకుని మోదీ హిందీలో ఆ క్షేత్ర వివరాలు విన్నారు. దాదాపు 20కి పైగా ఆలయాలను దర్శించుకుని విశేషాలు తెలుసుకున్నారు.
ఆకట్టుకున్న లేజర్ షో
దివ్యదేశాల సందర్శన అనంతరం ప్రధాని సమతామూర్తి కేంద్రానికి చేరుకున్నారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యాక, మోదీ సహా ముఖ్యులు విజయస్తూపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి చేరుకుని లేజర్ షోను వీక్షించారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆద్యంతం ఆకట్టుకుంది. రామానుజాచార్యుల విశిష్టత, ఆయన జననం, సమతా సిద్ధాంతం.. ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ దీన్ని రూపొందించారు.