రాబోవు 20 నెలలు కష్టపడితే టికెట్ల ఇస్తామని లేదంటే ఇచ్చేది లేదని యువజన కాంగ్రెస్ నాయకులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే వారికి బీ ఫామ్‌లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. రాజకీయాలు చేస్తా అంటే టికెట్లు రావని, సైనికుడిగా కొట్లాడితే టికెట్లు వాటంతట అవే వస్తాయని వివరించారు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులు కూడా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలిపారు. శంషాబాద్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ దిశానిర్దేశం చేశారు.
యూత్ కాంగ్రెస్ వాళ్లకు టికెట్ల ఇచ్చే ముందు... ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో లేదో చూస్తామని రేవంత్ రెడ్డ అన్నారు. నిర్ణయాలు పీసీసీ చేసినా.. ఓట్లు వేయించే బాధ్యత యూత్ కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. సంక్షోభం ఉన్నప్పుడే నాయకులు పుట్టుకొస్తారన్న రేవంత్... కాంగ్రెస్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందన్నారు. రేవంత్ పార్టీ మారలేదా అని కొందరు అంటున్నారని... రేవంత్ రెడ్డి పార్టీ మారినా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినానని.. అధికార పార్టీలోకి… అధికారం కోసం పోలేదని స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి కాలు చిప్ప పగల గొట్టుకుంటే... రాహుల్ గాంధీ పక్కన వచ్చి కూర్చురన్నారు. కాంగ్రెస్‌కి ఎవరు ఓనర్లు లేరని... ఎవరు కష్టపడితే వాళ్లే ఓనర్లను చెప్పారు.