హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్ 4 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండగా.. అధికారులు ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు తెరిచారు. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల మేరకు జలమండలి అధికారులు జలాశయాల గేట్లు ఎత్తారు. ఉస్మాన్‌సాగర్‌లోకి 1,100 క్యూసెక్కుల వరద వస్తోంది. ఉస్మాన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,788.8 అడుగులుగా ఉంది.
నిండు కుండలా..
హిమాయత్‌సాగర్‌లోకి 800 క్యూసెక్కులు వస్తుండగా.. నాలుగు గేట్ల ద్వారా 14 వందల క్యూసెక్కులు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1,763.5 అడుగులకుగాను.. 1,761.75 అడుగుల నీరు నిల్వ ఉంది. జంట జలాశయాల నుంచి నీరు దిగువకు విడుదల అవుతుండగా.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు.
జలమయం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన(hyderabad rains) కురుస్తోంది. నగరంలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది. అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, మీర్‌పేట, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.