తెలంగాణ

telangana

ETV Bharat / state

అయిన వాళ్లు పొమ్మన్నారు... కానీ వాళ్లు ఆదరించారు - rangareddy

నిండుజీవితం ఎన్నో జ్ఞాపకాలమయం. కొన్ని మధురమైనవి.. ఇంకొన్ని భారమైనవి. సువిశాల మానవ సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కరవైపోతున్నాయి. విశాలమైన ఇళ్లలో మనసులు ఇరుకైపోతున్నవి. ధనార్జనే ధ్యేయంగా కాలంవెంట పరుగులు పెడుతూ రక్తసంబంధాలకే పాతరేస్తున్నారు నేటితరం. తమ జీవితాన్ని పిల్లలకోసం త్యాగంచేసి చరమాంకంలో వారి నుంచి ఆసరా కోసం ఎదురుచూసే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. అలాంటి వారందరినీ అక్కున చేర్చుకుని వార్థక్యంలో తోడుగా నిలిచింది మాతాపితరుల సేవాసదనం​.

old-age-home-pkg

By

Published : May 12, 2019, 7:08 PM IST

Updated : May 12, 2019, 9:24 PM IST

అయిన వాళ్లు పొమ్మన్నారు... కానీ వాళ్లు ఆదరించారు

గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలే బయటకి పొమ్మన్నారు. ఆదరించి పెంచిన వారిని బయటకు నెట్టేశారు. ఎంతో జీవితాన్ని చూసిన వారికి నేడు జీవనం భారమైంది. దిక్కుతోచని స్థితిలో ఆ పండుటాకులకు ఆసరాగా నిలిచింది మాతాపితరుల సేవాసదనం​. వీళ్లకు ఇప్పుడు కావాల్సింది పట్టెడన్నం, గుప్పెడు ప్రేమ, పుట్టెడు ఆదరణ. వార్థక్యంలో వ్యధలతో గడుపుతున్న వారికి అదో దేవాలయం.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోడానికి అదో కళాశాల. భక్తికోసం అదో ధ్యాన మందిరం.. తమ జీవితాలతో ముడిపడిన పవిత్ర ప్రదేశం ఈ మాతాపితురులు సేవాసదనం​.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్​లోని మాతాపితరుల సేవాసదనం​ ఆదరణ కరవైన ఎందరో వృద్ధుల పాలిట అమ్మఒడి. స్వాతంత్య్ర సమరయోధుడు బండారు చిన్న రంగారెడ్డికి ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చింది. రెండెకరాల్లో మాతాపితురుల సేవాసదనం పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తన భార్య సరోజినీదేవి స్మృత్యర్థం పౌండేషన్​ ఏర్పాటు చేసి 2005 నుంచి ఎందరికో ఆశ్రయం కల్పించాడు.

పింఛనుతోనే ఆసరా ఇస్తూ

తమకొచ్చే పింఛనుతో పాటు దాతల సహకారంతో దీనిని నడిపిస్తున్నారు ట్రస్ట్​సభ్యులు. ఆశ్రమంలో ఎవరిని చూసినా పైకి గంభీరంగానే కనబడతారు. కష్టాలు తలచుకొని బాధపడుతున్నారు. ఎవరిని పలకరించినా మౌనం... పొడిపొడి మాటలే.. ఆశలేని ఆ కళ్లమాటున కన్నీటి చారలు మన చూపును దాటిపోవు. చిన్నపిల్లలై దు:ఖంతో కన్నీటి పర్యంతమవుతారు.

ఎవరికి వారివే దీన గాథలు

ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నంత ప్రశాంతంగా ఉంటోంది ఆ ఆశ్రమ ప్రాంగణం. రకరకాల పళ్లు, పూల మొక్కలు, కూరగాయలు వారే పండించుకుంటారు. ఆధ్యాత్మికతతో భజనలు, దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారంతా ఓ కుటుంబమైపోయారు.

అయినవాళ్ల ఆదరణకు నోచుకోని వారందరినీ చేరదీసి నూతన జీవితాన్ని ప్రసాదించిన ఈ ఆశ్రమం వారికి ప్రాణసమానం. ఈ సేవాకార్యక్రమానికి రూపం ఇచ్చిన ఆశ్రమ నిర్వాహకులు ఎందరికో ఆదర్శం.

ఇదీ చదవండి: అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే

Last Updated : May 12, 2019, 9:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details