హైదరాబాద్ రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నూనె గింజల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై రెండు రోజులపాటు జరిగిన జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును తొలి రోజు ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఐసీఏఆర్ అనుబంధ జాతీయ పరిశోధన సంస్థల సంచాలకులు, వ్యవసాయ వర్సిటీల పూర్వ ఉపకులపతులు, పలు విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు, 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
శాస్త్రవేత్తల అభిప్రాయాలు
పౌష్టికాహార భద్రత -నూనె గింజల పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెంచి లాభదాయకంగా తీర్చిదిద్దడం, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆధునిక ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చించారు. ఏటా మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి పామాయిల్, ఇతర ముడి, వంట నూనెల దిగుమతుల కోసం 70 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నందున... నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంపొందుకోవాల్సి ఉందని డాక్టర్ మహాపాత్ర దిశానిర్దేశం చేశారు.