కబ్జాదారులకు హైదరాబాద్ నగర శివారుల్లోని చెరువులు సిరులు కురిపిస్తున్నాయి. రెవెన్యూ, సాగునీటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని కొన్ని స్థిరాస్తి వెంచర్లుగా మారిపోతుండగా... మరికొన్నింటిలో గిడ్డంగులు వెలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పేరు చెప్పి, అధికారులను బెదిరించి మరీ పూడ్చి వేస్తున్నారు. శంషాబాద్ మండలంలో ఏడాదిన్నర కాలంలో 30 చెరువులు పూర్తిగా అంతర్థానమవగా, మరో అయిదారింటిలో 30 ఎకరాల భూమిని చెరపట్టారు. ఒక చెరువులో లే అవుట్ వేసి అమ్మేశారు.
బాహ్యవలయ రహదారి(ORR)కి ఆనుకొని ఉన్న చెరువుల సమీపంలోని భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్నాయి. కొందరు కబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారుల కళ్లు వాటిపై పడ్డాయి. జీవో నం.111 ప్రకారం చెరువు భూముల్లో నిర్మాణాలకు అనుమతులివ్వరు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌టీఎల్‌లోఉన్న భూములను పూడ్చి లే అవుట్లు, కల్యాణ మండపాలు, గిడ్డంగులు, కోళ్ల ఫారాలను నిర్మిస్తున్నారు. జలవనరులపై ఆధారపడిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దగోల్కొండ బైరమోని చెరువు:పెద్దగోల్కొండలో ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని 14 ఎకరాల్లో బైరమోని చెరువు విస్తరించింది. గతేడాది ఓ కబ్జాదారుడు కన్నేసి, మట్టితో పూడ్పించాడు. ఆనవాళ్లు లేకుండా చేసి, స్థిరాస్తి వెంచర్ వేసి, రూ.కోట్లకు అమ్ముకున్నాడు. స్థానికులు పలుమార్లు రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు మొదలయ్యాయి. పట్టా భూమని కొందరు వాదిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టా భూమిలో చెరువుంటే వ్యవసాయం చేసుకోవచ్చు కానీ నిర్మాణాలు చేపట్టరాదు.
శంషాబాద్ మండలంలో 30 కనుమరుగు
శంషాబాద్ మండలంలోని 40 గ్రామాల్లో భూగర్భ జలాల పరిరక్షణకు కాకతీయులు, నిజాం పాలకులు 90కి పైగా చెరువులు, కుంటలను నిర్మించారు. అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై 30 చెరువులను మాయం చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ.2 కోట్లు వెచ్చించి 55 జలవనరులను నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల పునరుద్ధరించారు. ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని హమీదుల్లానగర్, సంఘీగూడ, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ గ్రామాల్లోని చెరువులనూ కబ్జాదారులు చెరబట్టారు.