దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ నాలుగో రోజు విచారణ ముగిసింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎన్హెచ్ఆర్సీ బృందం విచారించింది. షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులను కూడా కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. వీరితో పాటు నిందితులు పెట్రోల్ పోయించుకున్న బంకులో పని చేస్తున్న సర్వీస్ మెన్ ప్రవీణ్నూ విచారించారు. పోలీసులు ఇచ్చిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికను కూలంకషంగా పరిశీలించింది. ఘటనకు ముందు, తర్వాత పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది.
నాలుగో రోజు ముగిసిన ఎన్హెచ్ఆర్సీ విచారణ...
16:28 December 10
చెన్నకేశవులు భార్య తన భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించడంతో దీనిపై పోలీసులను బృందం వివరణ కోరింది. నాలుగు రోజులపాటు చేసిన విచారణలో ఎన్హెచ్ఆర్సీ బృందం దాదాపు అన్ని అంశాలపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. రేపు కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. నిందితుల ఎదురుదాడిలో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు పూర్తిగా కొలుకున్నట్లు సమాచారం.
ఇవీచూడండి: దిశ హత్యాచార ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి పోలీసుల నివేదిక