ఏటీఎం మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వచ్చేటపుడు మోసపోయాడు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని పోచమ్మ బస్తీలో గాడిపల్లి యాదగిరి నివాసం ఉంటున్నారు. డబ్బులు జమ చేసేందుకు ఏటీఎం డిపాజిట్ కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే ఆ ఏటీఎం లోపల విద్యా సాగర్ అనే వ్యక్తి ఉన్నాడు. యాదగిరి డబ్బును డిపాజిట్ చేసేందుకు అతన్ని సహాయం కోరాడు.
అది అదునుగా తీసుకున్న విద్యాసాగర్... అతన్ని మాటల్లో పెట్టి ఏటీఎం కార్డ్ పిన్ నంబర్ తెలుసుకున్నాడు. ఆ తరువాత యాదరిగి చెప్పిన ఖాతాలో రూ. 42,500 జమ చేశాడు. డబ్బులు జమ చేసిన తర్వాత విద్యాసాగర్ అతని ఏటీఎం కార్డును తీసుకుని అలాంటి మరో కార్డును యాదగిరికి ఇచ్చాడు. అది గమనించని యాదగిరి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీసుకున్న ఏటీఎం కార్డుతో విద్యాసాగర్ రూ. 41, 100 డ్రా చేసి తీసుకెళ్లాడు.