కాంక్రీట్ జంగిల్‌గా మారిన బడంగ్‌పేట
రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్త... ఇళ్ల ముందు అస్తవ్యస్థంగా మారిన మురుగునీటి వ్యవస్థ.... విచ్చలవిడిగా తవ్విన రహదారులతో దర్శనమిస్తున్న ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని బడంగ్‌పేట. నిజాం కాలంలో పెద్ద పెద్ద గడీలతో అలరారిన ఈ గ్రామం కాలక్రమంలో కాంక్రిట్ జంగిల్‌గా మారింది. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉండడంతో... ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా బడంగ్‌పేట చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పెరుగుతున్న జనాభాతోపాటు పాలనా సౌలభ్యం కోసం... ఐదేళ్లలోనే బడంగ్‌పేటను పురపాలక సంఘంగా మార్చారు. గతేడాది జులైలో ప్రభుత్వం బడంగ్‌పేట పురపాలక సంఘాన్ని... నగర పాలక సంస్థ స్థాయికి చేర్చింది.
చెత్త డబ్బా తీసుకెళ్లాలంటే చేయి తడపాల్సిందే..!
ఏడేళ్లలో బడంగ్‌పేట నగరపాలక సంస్థ జనాభా వేల నుంచి లక్షలు దాటింది. సుమారు 2 లక్షలకుపైగా జనాభా ఉండగా... 32 వార్డులున్నాయి. ఈ కార్పొరేషన్‌కు 38 కోట్ల 30 లక్షల వార్షిక ఆదాయం వస్తోంది. పంచాయతీల నుంచి నగరపాలక సంస్థగా ఎదిగినా... అభివృద్ధిలో ముందుకెళ్లడం లేదు. తాగునీటి సమస్య మొదలు మురుగునీటి వ్యవస్థ, అధ్వాన్నపు రహదారులతో ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రధాన రహదారుల వెంట చెత్త పేరుకుపోతోంది. కొన్ని ప్రాంతాలు మురికిగుంటలుగా మారి పందులకు ఆవాసాలుగా మారిపోయాయి. చెత్త, చెదారం చేరి దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల పురవాసులు అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. ఇంటి ముందు చెత్త డబ్బా తీసుకెళ్లడానికి కూడా... సిబ్బంది చేయి తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.