తల్లినే ఆదర్శం తీసుకుంది.. ఇప్పుడు తానే ఆదర్శం అయ్యింది రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో ఐదేళ్ల క్రితం సరూర్‌నగర్‌కు చెందిన పరమేశ్వరి షైన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తన తల్లి నలుగురు పిల్లలను ఎంతో కష్టపడి పెంచింది. తల్లే తనకు స్ఫూర్తి అని ఆమె అంటున్నారు. ఆర్థిక ఎదుగుదల ముఖ్యమని తమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్త్రీలకు సహకారం అందించాలనే ఆలోచనతో టైలరింగ్, బ్యూటీ కోర్సులు, కంప్యూటర్ బేసిక్స్, ప్యాడ్స్ తయారుచేయడం నేర్పిస్తున్నారు.
వెలుగు నింపే ప్రయత్నం
గ్రామీణ పేద మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 60 గ్రామాల్లో రెండు వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. మహిళల ఆరోగ్యం పర్యావరణం గురించి ఆలోచించారు. వినూత్నంగా ఎకో ఫ్రెండ్లీ సానిటరీ ప్యాడ్స్ తయారు చేశారు. ఓవైపు ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడుతూ, మరోవైపు సాటివారి నెలసరి ఇబ్బందులను నివారిస్తున్నారు పరమేశ్వరి.
తెలంగాణకు మొదటి స్థానం
దేశంలో పది రాష్ట్రాల్లో సానిటరీ ప్యాడ్స్ మేకింగ్ నిర్వహణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల విషయంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. తుర్కయంజాల్ గ్రామంలో అద్భుత విజయం సాధించారు. అందుకు కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ చేతులమీదుగా స్త్రీ స్వాభిమాన్ ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకున్నారు.
చుట్టుపక్కల మహిళలకూ ఉచితం
భవిష్యత్తులో మహిళలకు నైపుణ్య శిక్షణతో పాటు ఆరోగ్యం పరిశుభ్రతపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పరమేశ్వరి అంటున్నారు. తాము తయారు చేసిన ప్యాడ్స్‌ను స్థానిక విద్యార్థులకు, చుట్టుపక్కల మహిళలకూ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. వాళ్లు ఇచ్చే సూచనలతో లోపాలను సరి చూసుకుంటూ అత్యుత్తమ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులతో శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పర్యావరణహిత ప్యాడ్స్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. తాము తయారు చేసిన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
ఇదీ చూడండి :రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెషన్