తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతి వనాల ఏర్పాటులో శివారులే ఘనం - హైదరాబాద్ శివారు జిల్లాల్లో పచ్చదనం

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో జంట జిల్లాలు రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా ప్రథమస్థానంలో నిలవగా రంగారెడ్డి జిల్లా రెండోస్థానం సాధించింది. ప్రకృతి వనాల పెంపులో రాష్ట్ర సగటు 42 మాత్రమే ఉండగా మేడ్చల్‌ జిల్లాలో 96 శాతం, రంగారెడ్డి జిల్లాలో 90 శాతం పనులు మొదలయ్యాయి.

more greenery and plants at outskirt districts of Hyderabad
ప్రకృతి వనాల ఏర్పాటులో శివారులే ఘనం

By

Published : Aug 5, 2020, 9:20 AM IST

మహానగరం.. ఎటు చూసినా కాంక్రీట్‌ జంగిల్‌ను తలపించే ప్రాంతం. పచ్చదనం చాలావరకు మాయమైంది. నగరంలో స్థలాల కొరత దృష్ట్యా శివారు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ కాంక్రీట్‌ నిర్మాణాలు పెరిగి పచ్చదనం కనుమరుగవుతున్న పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు అమోయ్‌కుమార్‌, వి.వెంకటేశ్వర్లు ప్రకృతి వనాల ఏర్పాటుపై ద్రృష్టి పెట్టారు. ప్రతి గ్రామంలో స్థలాన్ని గుర్తించి వనాల ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో అర ఎకరా స్థలం అందుబాటులో ఉంటే 2 వేల మొక్కలు పెంచే లక్ష్యంతో వనాల ఏర్పాటు జరుగుతోంది.

ఇదీ జిల్లాల పరిస్థితి

  • మేడ్చల్‌ జిల్లాలో 61 పంచాయతీలుండగా మరో 20 ఆవాస గ్రామాలున్నాయి. వీటిల్లో 51 పంచాయతీల్లో వనాలు పెంచేందుకు భూములు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 49 పంచాయతీల్లో మొక్కల పెంపకం మొదలవ్వడం విశేషం.
  • రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలకుగాను 438 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పెంపునకు అర ఎకరాకన్నా అధిక విస్తీర్ణంలో భూములను జిల్లా పాలన యంత్రాంగం సేకరించింది. వీటిల్లో 398 గ్రామాల్లో ప్రకృతి వనాల పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో ఉన్న వనాల పరిరక్షణ, నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలుగా ముగ్గురు లేదా నలుగురు సభ్యులను నియమించాలని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అర ఎకరా స్థలంలో 2 వేల మొక్కలు, ముప్పావు ఎకరా స్థలంలో 3 వేల మొక్కలు, ఎకరా స్థలంలో 4 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ABOUT THE AUTHOR

...view details