Sabitha Indrareddy: శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులు గ్రంథాలయాలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ పరిధిలో రూ.4.36 కోట్లతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో గ్రంథాలయము నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
పోటీపరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పది లక్షల రూపాయలతో పుస్తకాలను కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. దాతలు గ్రంథాలయాలకు సహకరించాలని తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బోగ్గరపు దయానంద్, వాణి దేవి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కాప్పటి పాండురంగా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.