Minister Sabitha Indrareddy Mahadharna: వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. అనంతరం మహిళలు, కార్యకర్తలతో కలిసి బాలాపూర్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లతో ధర్నా చేశారు. వంట గ్యాస్ ధరల పెరుగుదల కారణంగా సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని మంత్రి సబిత అన్నారు.
'మోదీజీ సిలిండర్ తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో' అనే నినాదంతో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాలాపూర్ చౌరస్తా వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మహా ధర్నా చేపట్టారు. డీజిల్, గ్యాస్ సిలిండర్ నిత్యావసర ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల వంట్టింట్లో కష్టాలు తెచ్చి పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై మహిళలు పెద్ద ఎత్తున తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని.. తమ నిరసనను దిల్లీకి వినిపించేలా గర్జిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుండా నాటకాలు ఆడుతోందని మంత్రి సబిత విమర్శించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.