Sabitha on schools close: విద్యా సంస్థల్లో కొవిడ్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్‌పై రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నమ్మొద్దు
rumours in social media: రంగారెడ్డి జిల్లాలో అందరికీ టీకాలు అందించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రెండో డోసు విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించాలని ఆమె సూచించారు. కేసుల నమోదుపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.
ఇప్పటికే రెండేళ్లు నష్టపోయారు
Sabitha on vaccination: పాఠశాలల్లో అక్కడక్కడా స్పల్పంగా కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో కొవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు నష్టపోవడం వల్ల వారి భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
పాఠశాలల్లో కొవిడ్ నియమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాం. స్కూళ్లలో ప్రస్తుతం వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి, పిల్లల తల్లిదండ్రులకు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోండి. పాఠశాల వంట సిబ్బందికి టీకాలు ఇప్పించండి. ఇప్పటికే రెండేళ్లు విద్యార్థులు కోల్పోయారు. పాఠశాల సిబ్బంది తప్పనిసరిగా టీకాలు తీసుకోండి. దీనికోసం పాఠశాల ప్రిన్సిపల్స్ కూడా అవగాహన కల్పించాలి. స్కూళ్లలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తాం. ఏదైనా ఉంటే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖమంత్రి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి