ఇఫ్కో(భారత రైతుల సహకార సంస్థ) ఆవిష్కరణ... నానో యూరియా సాధారణ రైతుబిడ్డ విజయం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్‌లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఇఫ్కో వైస్ ఛైర్మన్, జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ అధిపతి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేష్ రాలియా ఘనస్వాగతం పలికారు.
విప్లవాత్మక మార్పునకు శ్రీకారం
ఇఫ్కో యూనిట్‌లో రోజుకు లక్షా 50 వేల నానో యూరియా బాటిళ్ల ఉత్పత్తిని మంత్రి పరిశీలించారు. రోజుకు 67 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం తీరు తిలకించారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం వద్ద మంత్రి ప్రతిపాదించగా... ఈ అంశం ఇఫ్కో బోర్డు సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వపరంగా భూమితోపాటు ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కశ్మీర్- కన్యాకుమారి, ముంబయి- విజయవాడ, కోల్‌కతా జాతీయ రహదారులు సౌలభ్యం సహా మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎరువుల వాడకంలో సాంప్రదాయ పద్ధతుల వల్ల నష్టపోతున్న రైతులను నానో ఎరువుల వైపు మళ్లిస్తే విప్లవాత్మక మార్పు మొదలవుతుందని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.