రైతు వేదికల ఏర్పాటులో తామూ భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఎవరూ ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ రైతుల పట్ల సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో 3 రైతు వేదికలను, పలు అభివృద్ధి పనులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ రైతు వేదికలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు నెలల్లోనే పూర్తిచేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమని ఆరోపించారు. కొత్త చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా లేవని ఇతర రాష్ట్రాల్లో రైతులు భావిస్తున్నారని అన్నారు. మద్దతు ధర ప్రకటించకుండా పంటని ఎలా కొనుగోలు చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.