Gateway IT Park at Kandlakoya : రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 15 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 20వేల మందికి పైగా పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయని కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన ఈనెల 17న దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ఈనెల 17న భూమిపూజ
KTR Will foundation stone to Kandlakoya IT Park : 2018 ఏప్రిల్ 29న మంత్రి కేటీఆర్‌కి లాస్య ఇన్ఫోటెక్ సంస్థ ట్వీట్ చేసింది. గత 15ఏళ్ల నుంచి గచ్చిబౌలిలో ఉద్యోగాలు చేసిన కొంత మంది ఐటీ ఉద్యోగులు కలిసి స్వతహాగా కొంపల్లి పరిసరాల్లో స్టార్టప్స్ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ త్వరలో కొంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి మేడ్చల్ జిల్లా అధికారులు, కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులందరు కలిసి దుండిగల్, పేట్ బషీరాబాద్‌లో భూమిని పరిశీలించగా చివరకు కండ్లకోయ వద్ద ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించింది. మొత్తం 120కి పైగా సంస్థలు ఉండగా 90 సంస్థలకు నూతనంగా నిర్మించే ఐటీ టవర్స్‌లో వారికి స్థలాలను కేటాయించారు. ఈనెల 17న వారికి కేటాయింపు పత్రాలను అందించనున్నట్లు కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్(కేఐటీఈఏ) అధ్యక్షుడు వెంకట్ తెలిపారు.
ఐదేళ్ల క్రితం ఇక్కడ ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాం. మేం మంతా కేటీఆర్‌కు ట్వీట్ చేశాం. దానిపై ఆయన స్పందించారు. కొంపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ప్రదేశాలు పరిశీలించారు. అనుకూలంగా ఉన్న వాటిని సెలక్ట్ చేసుకోమన్నారు. కండ్లకోయ ప్రాంతంలో పదెకరాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. హైటెక్ సిటీ ఫుల్ అయింది. రేట్లు కూడా పెరిగాయి. అందుకే ఇక్కడ నెలకొల్పాలని అనుకున్నాం. ఇందులో 125-150 కంపెనీలు ఉన్నాయి. సూక్ష్మ, మధ్యతరహా కంపెనీలన్నీ కలిసి అసోసియేషన్లాగా ఏర్పాటయ్యాయి. ఈనెల 17న భూమిపూజ ఉంది. రెండేళ్లలో ఈ టవర్స్ రెడీ అవుతాయి. ఇది ఫేజ్-1. ఆ తర్వాత ఫేజ్-2, ఫేజ్-3 కూడా ఉంటుంది.
-వెంకట్, కేఐటీఈఏ అధ్యక్షుడు