Minister KTR on Textile Sector : రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ నివేదికను తయారు చేయాలని రాష్ట్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి కేటీఆర్.. అధికారులను ఆదేశించారు. టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులకు మంచి స్పందన వస్తోందని.. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు చేనేత రంగంపై అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా
Minister KTR on Textile Industry : అంతర్జాతీయ కంపెనీ యంగ్ వన్, దేశీయ టెక్స్‌టైల్ దిగ్గజం కైటెక్స్ లాంటి కంపెనీలు తెలంగాణలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవ వనరులను, ప్రభుత్వ పాలసీలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఉపాధి కల్పన, నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేత రంగానికి అవసరమైన మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ మేరకు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు అన్నింటినీ నివేదికలో పొందుపరచాలని సూచించారు. అలాగే టెక్స్‌టైల్ శాఖ తరఫున బడ్జెట్‌లో పొందుపర్చాల్సిన అంశాలు, పథకాలు, ఇతర కార్యక్రమాలపైన మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.
ఇదీ చదవండి:Telangana GSDP: రికార్డు స్థాయిలో తెలంగాణ వృద్ధిరేటు నమోదు