హైదరాబాద్ నగరంలోని వలసకూలీల పరిస్థితులు, యోగక్షేమాలు తెలుసుకునేందుకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ నిర్మాణ కంపెనీ సైట్లో పనిచేస్తున్న ఒడిశా, బంగాల్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన 400 మంది కూలీలను పలకరించారు. వలస కూలీలతో మాట్లాడి వారి స్థితిగతులు, యోగక్షేమాలు తెలుసుకున్న కేటీఆర్... అందుతున్న ఆహారం, రేషన్ సరుకుల గురించి ఆరా తీశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని వలసకూలీలను అడిగారు.
త్వరలోనే సంక్షోభం పోతుంది
లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించినందున నిబంధనలు పాటించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. త్వరలోనే కరోనా మహమ్మారి సంక్షోభం తొలగిపోతుందని భరోసా ఇచ్చారు. అప్పటి వరకు బయటకు వెళ్లకుండా ఏర్పాటు చేసిన వసతిలోనే ఉండాలని మంత్రి కోరారు.